ప్రముఖ తెలుగు సినీ రివ్యూ రైటర్ మరియు నవల రచయిత మృతి

updated: March 3, 2018 10:29 IST
ప్రముఖ తెలుగు సినీ రివ్యూ రైటర్ మరియు నవల రచయిత  మృతి

తెలుగు సినిమా రివ్యూలకు  ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చే విధంగా ...దాదాపు 1250 రివ్యూలు దాకా రాసిన దేవరాజు రవి (79) ఇక లేరు.  గత కొంతకాలంగా క్యాన్సర్ వాధితో బాధపడుతున్న ఆయన మార్చి 2వతేదీ ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌లోని మేడిపల్లిలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సితార, శివరంజని, మేఘసందేశం, నంబర్ వన్ సినిమా పత్రికలలో ఆయన రాసిన సమీక్షలు పాఠకుల్ని విశేషంగా ఆకట్టుకోడమేకాక నిష్పక్షపాత సమీక్షలు కావడంతో సినీ వర్గాల ప్రశంసల్ని పొందాయి.

కేవలం రివ్యూ రైటర్ గానే కాక... ప్రముఖ కథకుడు, నవలాకారుడు...దేవరాజు రవి.  అన్నిటినీ మించి సాంఘిక సేవా కార్యకర్త ఆయన. దేవరాజు రవి 12 నవలలు, 200కు పైగా కథలు, 1250 సినిమా సమీక్షలు, ఇంకా పలు ఇతర వ్యాసాలూ రాశారు. 1959లో రామం అనే నవలతో ప్రారంభమైన ఆయన రచనా వ్యాసంగం చివరిరోజు వరకు కొనసాగింది. మూడు కవితా సంపుటాలు, రెండు కథా సంపుటాలు వెలువరించారు.  ఆయన రచనల్ని సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి వంటి ప్రముఖులు మెచ్చుకున్నారు. నంది అవార్డుల కమిటీలో రెండుసార్లు సభ్యులుగా ఉన్నారు.

తెలుగులో తొలి డిటెక్టివ్ నవల ‘వాడే వీడు’ రచయిత దేవరాజు వెంకట కృష్ణారావు తనయులు దేవరాజు రవి. వీరి స్వస్థలం బరంపురం. దేవరాజు రవి సుప్రసిద్ధ సాంఘిక కార్యకర్త. కుష్టువ్యాధి నిర్మూలనకు విశేషంగా కృషి చేశారు. ఎంతోమంది రోగులకు స్వయంగా సేవ చేశారు. లెప్రసీ డాక్టర్‌గా ఏరికోరి ఉద్యోగం చేసి, పదవి విరమణ అనంతరం సైతం ఆ సేవల్ని కొనసాగించారు. ఈ రోజు  (శనివారం) హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. దేవరాజు రవి మృతి పట్ల ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది.

comments