‘నవలా దేశపు రాణి’ ఇక లేరు

updated: May 21, 2018 12:14 IST
‘నవలా దేశపు రాణి’ ఇక లేరు

ప్రముఖ తెలుగు నవలా రచయిత్రి, ‘నవలా దేశపు రాణి’ యద్దనపూడి సులోచనారాణి (79) ఇక లేరు. అమెరికాలోని కాలిఫోర్నియాలో కుమార్తెతో పాటు ఉంటున్న ఆమె గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.ఆమె రాసిన అనేక నవలలు పాఠకాదరణ  పొందటమే కాకుండా.. సినిమాలుగా, టీవీ సీరియళ్లుగా తెరకెక్కాయి.   ఆమె రచనల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నవల ‘మీనా’. దీని ఆధారంగానే ‘మీనా’ చిత్రం తెరకెక్కింది. రీసెంట్ గా నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ కు కూడా మీనా నవలే ఆధారం కావటం విశేషం. 

ఆవిడ నవలల్లో ఎక్కువగా.. భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ అనుభంధాలు చోటు చేసుకునేవి. మధ్యతరగతి వారిని ఆకట్టుకునేవి. అలాగే ఆ నవల్లో హీరోయిన్స్..మధ్య తరగతి అమ్మాయిల వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం, హుందాతనం, మాటకారితనం తో ఉండేవారు. ఎక్కువగా కోటీశ్వరుడైన హీరో,  మధ్యతరగతి హీరోయిన్, విరిద్ధరి మధ్యా  పుట్టే ప్రేమ. ఇదే వీరి నవలా  ధీమ్ గా  సాగింది.

 ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిజాతం, ఆశల శిఖరాలు, అమరహృదయం, మౌన తరంగాలు, దాంపత్యవనం, ప్రేమ, వెన్నెల్లో మల్లిక, కలల కౌగిలి, గిరిజా కళ్యాణం... ... ఇలా సుమారు 40 నవలల వరకూ రాశారు. సెక్రటరీ  నవల ఆమె రాసిన రోజుల్లో ప్రతి యువకుడు ఓ రాజశేఖరంలా, ప్రతి యువతీ ఆత్మాభిమానం గల జయంతిలా ఉండాలనుకునే వారంటే అతిశయోక్తి కాదు.

యద్దనపూడి సులోచనారాణి  మొదట సారిగా చదువుకున్న అమ్మాయిలు చిత్రం ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 1965లో మనుషులు - మమతలు సినిమాకు కథను అందించారు. తర్వాత వీరు రాసిన మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, ఛండీప్రియ, ప్రేమలేఖలు, విచిత్రబంధం, బంగారుకలం లాంటి నవలలు చలనచిత్రాలుగా వచ్చాయి. అయితే సెక్రటరీ మాత్రం ఓ తిరుగులేని చిత్రంగా మిగిలిపోయింది.


యుద్దనపూడి గారి  రచనలు ఇప్పటికీ ఏదో ఒక  టీవీ ఛానెల్లో  సీరియల్ గా వస్తూనే ఉన్నాయి. మాటీవిలో  వచ్చిన రాధ -మధు సీరియల్ కథ వీరిదే. ఈ రోజుకీ చాలామంది పాఠకుల హృదయాల్లో వీరి నవలలు నిక్షిప్తమయి అలరిస్తూనే ఉన్నాయి.  
 

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: yaddanapudi sulochanrani, yaddanapudi sulochanranis death

comments